నేటి " దండోరా "
సమాచారం మనకి అందే విధానాన్ని బట్టి మనం ఆలోచించే విధానము, మన ఆలోచనా శక్తి , మన అవగాహన ఎలా మారాయి.
ఈ వ్యాసంలో రాసినవి నేను గమించినవి , చదివినవి , నాకు అర్ధమైన మార్పుల గురించి మాత్రమే.
సమాచారం మనకి అందే విధానాన్ని బట్టి మనం ఆలోచించే విధానము, మన ఆలోచనా శక్తి , మన అవగాహన ఎలా మారాయి. కేవలం కొన్ని సంస్థలు, పార్టీల ఆధిపత్యం ఒకప్పుడు ఉండే చోట ఆ ఆధిపత్యం ఎలా తగ్గుతూ వచ్చింది ఈ వ్యాసంలో చూద్దాము.
కాసేపు అలా కాలంలో కాస్త వెనక్కి వెళ్దాము
అది ఒక కుగ్రామం అప్పుడే నెమ్మదిగా తెల్లారుతోంది ఇంకా సూర్యుడు పూర్తిగా రాలేదు కూడా , ఇంటి ముందు ఆడవాళ్లు ముగ్గులు వెయ్యటం పూర్తి కాలేదు కూడా .. ఊరంతటిని దుప్పటిలా కప్పేసిన మంచు ఇంకా పూర్తిగా పోలేదు ... దూరంగా ఉన్న మనుషులు కనబడటం కష్టమే ...
దూరం నుంచి డప్పు కొడుతున్నట్టు సెబ్దం వినబడుతోంది, ఆ శబ్దం నెమ్మదిగా దెగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తోంది , ముగ్గులు వేసే మహిళలు వెయ్యటం ఆపి లేచి నిలబడి చూస్తున్నారు , ఇంట్లో ఉన్న మొగవారు బయటకి వచ్చి చూస్తున్నారు…
అలా అందరూ వీధి చివర శబ్దం వస్తున్న వైపు చూస్తున్నారు ఆ మంచులో నుంచి ఎవరో నడుచుకు వస్తున్నట్టు కనపడుతోంది ... కాళ్ళ వరకు కనపడుతోంది ... ఇంకా ఆ మనిషి దెగ్గరికి వచ్చే సరికి వారు అనుకున్నది నిజమే
వారు అనుకున్నట్టే అది డప్పు శబ్దమే
ఎప్పుడూ డప్పు వాయించే సాంబడే డప్పు వాయిస్తూ వస్తున్నాడు నెమ్మదిగా నడుచుకుంటూ.. నాలుగు మట్టి రోడ్ల మధ్యకి వచ్చాడు , అక్కడ ఆగి ఇంకోసారి గట్టిగా డప్పు వాయించాడు, అందరూ వచ్చారా లేదా అని నాలుగు వైపులా చూస్తూ వాయిస్తున్నాడు .... పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు … వాయించడం ఆపి ఇలా అంటున్నాడు
" ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా , ఈ రోజు ఉదయం పది గంటలకి దొర గారు అందరిని పంచాయితీకి మఱ్ఱి చెట్టు కాడికి రమ్మని దండోరా వేయించారహో, ఊరిలోని ప్రతి ఒక్కరు ఉండాలని దొరగారి ఆజ్ఞ " అని అరుస్తూ చెబుతున్నాడు
ఇదే మొట్టమొదటి వార్త స్రవంతి … ఊరిలో ఏదైనా సమస్య గురించి చెర్చించాలన్న ... ఎవరి మధ్య గొడవలైన పరిష్కరించాలన్న ... ఏదైనా జాతరలు జరపాలన్న .... ఊరంతా కలిసి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్న ... ఒకప్పుడు సమాచారం ఇలానే అందరికి తెలియచేసేవారు ....
Image Created by AI
కొన్ని ఏళ్ళ క్రితం ఏ వార్తయిన, విషయమైనా ఇలానే ఊరందరికీ తెలిసేది
అప్పట్లో అన్ని నిజాలే తెలిసేవా ? అందరూ ఉత్తములా? అందరూ ప్రశాంతంగా ఎవరి పని వారు చేసుకునే వార అంటే ముమ్మాటికీ కాదు .. అప్పట్లో కూడా పుకార్లు, చాడీలు ఊరంతా తిరుగుతూనే ఉండేవి కాకపోతే వాటికి ఒక మాధ్యమం ఉండేది కాదు అంతే ... గుంపులు గుంపులుగా పొలాల్లో కాని, దేవుడి ప్రాంగణాలు బయటకాని, అంగళ్ల ముందు కాని ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం ఇంటి బయట కాని నిజాలు, అబద్దాలు, చాడీలు, పుకార్లు అన్ని మాట్లాడుకునేవాళ్ళు పంచుకునేవాళ్ళు
సరే ఇక్కడ నుంచి ఇంకొన్ని ఏళ్ళు ముందుకి కాలంలో ప్రయాణం చేద్దాం
అదొక చిన్న పల్లెటూరు సమయం ఉదయం 6 అయ్యింది సుబ్బారావు గారు ఆయన ఇంటి వరండాలో అటు ఇటు తిరుగుతున్నాడు ... ఆలస్యం అవుతోంది అన్నట్టుగా అటు ఇటు తిరుగుతూ ఇంట్లోని గడియారంలో సమయం చూస్తున్నాడు ... అప్పుడప్పుడే తెల్లారుతోంది " ఎడి ఇంకా రాదే " అనుకుంటున్నాడు మనసులో ... అప్పుడే ఆయన ఇంటి గేటు దెగ్గర వచ్చి పడింది .. హమ్మయ్య వచ్చింది అని వెళ్లి తెచ్చుకున్నాడు ... అదే ఆరోజుటి వార్తా పత్రిక ... ఆ పత్రిక చదివితే కాని రోజు మొదలవ్వదు ... దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగిందో తెలుసుకోకపోతే బయటకి వెళ్ళాక ముచ్చట్లలలో పాల్గొనలేడు ...
ఇంచుమించు ఇలానే ఉండేది ఎక్కువ శాతం ఇళ్లల్లో పరిస్థితి అప్పట్లో ....
ఆ తర్వాత నెమ్మదిగా సాంబడి ఉద్యోగం కొత్త సాంకేతిక మార్పుల వల్ల అంతరించి పోయింది .... అదే వార్తా పత్రికలు రావటంతో ...
1902 లో మన తెలుగు ప్రాంతంలో మొదటి వార్తాపత్రిక మొదలయ్యింది అని ఆధారాలు చెబుతున్నాయి ....
ఆ నాడు వార్తా పత్రిక మొదలవ్వటం అనేది తెలుగు ప్రాంతంలో చాలా మార్పులని తెచ్చింది ... నలుమూలలా ఉండే ప్రజలకి స్వతంత్ర పోరాటాల గురించి ... సామజిక సమస్యల గురించి ... సామజిక మార్పుల గురించి సమాచారాలు అందడంలో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి ...
ప్రజలందరిని ఏకం చెయ్యటానికి, దేశ స్వతంత్ర సాధన కోసం పోరాడటానికి దేశం మీద ప్రాంతం మీద ప్రేమ గౌరవం పెరగటానికి ఆనాటి పత్రికలు ఎంతో ఉపయోగ పడ్డాయి ...
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన మార్పు ఏంటంటే అంతక ముందు వరకు నడిచిన దండోరాలకి ... ఈ పత్రికలకి ముఖ్య తేడా ఏంటంటే .... ఊరి దండోరా కేవలం ఆ గ్రామం లేదా ఆ గ్రామం పక్కన ఉండే ఒక పెద్ద పట్టణానికి సంబంధించని సమాచారం అందేది .... ఎప్పుడైతే ఈ వార్త పత్రికలు వచ్చాయో గ్రామం పట్టణమే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి ముఖ్యమైన సమాచారం అందేది ప్రజలకి చాలా విషయాలు తెలియడం మొదలయ్యింది
వారికి అప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలు తెలియడం మొదలయ్యాయి ... అప్పట్లో పత్రికలు చదివేవారు తక్కువే అయినా ... చదివిన వారు ఆ నోటా ఈ నోటా వారు చదివిన సమాచారాన్ని వ్యాప్తి చేసేవారు ....
ఇప్పుడు కాలంలో ఇంకాస్త ముందుకి ప్రయాణిద్దాం ...
అది ఆదివారం ఉదయం ... ఊరి మధ్యన ఉన్న చింతచెట్టు కింద అందరూ కూర్చుని ఎదురుచూస్తున్నారు ... గురునాధం చెట్టుకి ఏలాడదీసి దానికి ఉండే మరలాంటి దాన్ని తిప్పుతున్నాడు ...తిప్పుతున్నప్పుడు గస్ గస్ అని శబ్దం వస్తోంది .. మధ్య మధ్యలో ఏదో చిన్న శబ్దం వచ్చి పోతోంది ... గురునాధం దాన్ని తీక్షణంగా చూస్తూ అందులో కదిలే ముల్లుని చూస్తూ ఆ మర ని తిప్పుతున్నాడు ... ఈ సారి శబ్దం రాగానే తిప్పడం ఆపాడు ... అందులోనుంచి " ఇది ఆకాశవాణి, 9 గంటల వార్తలు" అని వినపబడింది
ఇదే రేడియో
1936 ఆ సమయంలో భారతదేశంలో మొదటి రేడియో ప్రసారం జరిగింది. అంతక ముందు నుంచే రేడియో ప్రసారాలు ఉన్నా మనకంటూ మద్రాస్ స్టేషన్ ప్రారంభమైంది 1936 లో
వార్తా పత్రికలు కొన్ని వారానికొకసారి , నెలకొకసారి వచ్చేవి చాలా తక్కువ మాత్రమే ప్రతిరోజు వచ్చేవి ... అంటే ఒక వారంలో జరిగిన విషయాలు , సమాచారం అంత వారానికి ఒకసారి తెలిసేవి అనమాట ...
రేడియో ప్రసారాలు మొదలయ్యాక సమాచారం అందే పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయి ...
పత్రికలు మొదట్లో ఎక్కువ శాతం మొగవారు చదివేవారు ... వారు మిగిలినవారితో పంచుకునేవారు ... పత్రికల్లో ఎంత సమాచారం ఉన్నా కాస్త చదువుకున్న వారు చదవడం వచ్చిన వారు మాత్రమే పత్రికలు చదవగలరు వాళ్ళే సమాచారం అందరికి అందించేవారు ....
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ... అతను ఏమి చదివిన అతనికి అర్ధమయిన దాని నుంచే చెబుతాడు ... అతని అవగాహనకి తగ్గట్టుగానే చెప్పగలడు ...
ఉదాహరణకి అతను చదివింది " తిరుపతి కొండ మీద నిన్న వాన పడింది " అని , అతను చెప్పింది " తిరుపతిలో వాన పడింది " అని వినేవాళ్ళని బట్టి కొందరికి ఇది " తిరుపతిలో వానలు పడుతున్నాయట " అని అర్ధం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు ...
రేడియో రావడంతో ఇది చాలా మారింది ఎందుకంటే చదువు వచ్చినా రాకపోయినా సంబంధంలేదు ... వినగలిగిన వారందరు సమాచారాన్ని గ్రహించవచ్చు ... అందరూ గుమ్మిగూడి ఒక చెట్టు కిందనో లేదా ఎవరైనా ఇంటి బయటనో వినడం మొదలయ్యింది ... ఇలా ఆడవారికి , పిల్లలకి , వృద్ధులకు అందరికి సమాచారం అందడం మొదలయ్యింది ...
నెమ్మదిగా సమాచారంతో పాటు దేశభక్తి పాటలు , పద్యాలు, ప్రసంఘాలు అందరికి అందుబాటులోకి వచ్చాయి ... అలానే నెమ్మదిగా వినోద కార్యక్రమాలు మిమిక్రీలు , నాటకాలు , కధలు రేడియో ద్వారా అందుబాటులోకి వచ్చాయి ....
సరే ఇప్పుడు ఇక్కడ నుంచి కాలంలో ఇంకాస్త ముందుకి వద్దాం
అది ఆదివారం... చీకటి పడుతోంది రాత్రి 8 అయ్యింది పెద్దవాళ్ళు , పిల్లలు అందరూ వెంకయ్య అయ్యోరు ఇంటికి హడావిడిగా చేరుకున్నారు ప్రతి వారంలానే వెక్కయ్య ఇంటి ముందు వరండాలో కూచున్నారు ... అప్పుడే వెంకయ్య ఇంట్లోనుంచి బల్ల తీసుకొచ్చి వరండా ముందున్న మెట్ల మీద పెట్టాడు ఆయన కొడుకేమో వైరు ప్లగ్ బాక్సు తెస్తున్నాడు ... వెంకయ్య లోపలికి పొయ్యి అతనొక పక్క గురునాధం ఒక పక్క పట్టుకుని జాగ్రత్తగా మోసుకువస్తున్నారు ... దాన్ని తీసుకొచ్చి బల్ల మీద పెట్టారు ...
అప్పటిదాకా గుసగుసలాడుతున్న వరండాలో కూర్చున్న జనమంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు ... బల్ల మీద పెట్టాక దానిపైన వేసిన గుడ్డని తీశారు ... దానికి ఉండే తలుపులు తీశారు ... అప్పుడు ఆ చిన్న తలుపుల వెనక ఉండే అద్దం కనిపించింది ..... ఈ లోపు ఆ వైరుని దానికి బిగించారు ... అది ఆన్ అయ్యి అందులో తెలుపు నలుపు చుక్కలు చిన్న చిన్న బంతులు లాగ ఉండి అటు ఇటు అస్తవ్యస్తంగా పరిగెడుతున్నాయి ....
ఇదే టీవీ .....
కాసేపటికి అందులోనుంచి శబ్దం రావడం మొదలయ్యింది ... అందరూ కన్నార్పకుండా నిశ్శబ్దంగా చూస్తున్నారు ... ఉన్నట్టుండి రత్తమ్మ ఒళ్ళో ఉన్న పిల్లడు ఏడుపు అందుకున్నాడు ... అందరూ ఆమెని బయటకిపో ఏందీ ఈడ లొల్లి అన్ని ముక్త కంఠంతో అరిచారు ... ఆమె పిల్లాడిని తీసుకుని ఈ రోజు చూసే భాగ్యం లేదు అని వెళ్ళిపోయింది ....
8 :30 సమయంలో ఒక కార్యక్రమం మొదలయ్యింది అదే " చిత్రలహరి " ... ముప్పై నిమిషాలు పాటలు వచ్చేవి అందరూ ఆత్రుతతో ఆనందంగా ఆ పాటలు విని ఇళ్ళకి వెళ్లేవారు ...
టీవీ తెచ్చిన గొప్ప మార్పేంటి అంటే ... అప్పటివరకు కేవలం విని సమాచారం తెలుసుకునే వారు ఇప్పుడు దృశ్యాలు చూడటం కుదిరింది ....
అప్పటిలో వార్తలు రోజుకి ఒకసారి వచ్చేవి రాత్రి 7 గంటలకు ... రేడియో ఏది వింటే అదే నిజము అనుకునే దెగ్గర నుంచి చూసి మాత్రమే నమ్మే స్థాయికి ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది
రేడియోలో " హైదరాబాద్ రహదారిలో ఘోర ప్రమాదం జరిగింది, 5 మంది చనిపోయారు " అంటే ఊహించుకుని అర్ధం చేసుకునే వారు ... టీవీ రాకతో అది మారింది నేరుగా ఆ దృశ్యాలు చూడటం మొదలయ్యింది ....
టీవీ వచ్చిన మొదట్లో కేవలం ప్రభుత్వ ఛానెల్స్ మాత్రమే ఉండేవి ... వారు చూపించింది వార్త వారు చూపించింది వినోదం ... నెమ్మదిగా ప్రైవేట్ వార్త ఛానెల్స్ రావడం మొదలయ్యింది
ఈ ప్రైవేట్ వార్త ఛానెల్స్ రావడం వల్ల జరిగిన గొప్ప మార్పు ఏంటి అంటే ... ఒక విషయానికి సంబంధించిన పలు కోణాలు నెమ్మదిగా ప్రజలకి అందుబాటులోకి రావడం మొదలయ్యింది ... ప్రజలు ఆలోచనా శక్తి మెరుగయ్యింది ... ఈ మార్పు వార్త పత్రికల వల్ల కూడా ఉండేది లేదని కాదు ... కాని ఎప్పుడైతే దృశ్య రూపంలో సమాచారం అందడం మొదలయ్యిందో దాని ప్రభావం ఎక్కువ అయ్యింది
తర్వాత జరిగిన మార్పులు ఏంటి అంటే .... రోజుకు ఒక గంట వార్తలు రావడం నుంచి రోజంతా వార్తలు రావడానికి పెరిగింది తర్వాత ఆదివారాల్లో కూడా వార్తలు రావడం మొదలయ్యింది ... చివరికి వార్తల కోసం ప్రత్యేక ఛానెల్స్ పురుడు పోసుకున్నాయి ....
ఇది దేశాన్ని చాలా మార్చింది అనే చెప్పాలి ఎందుకంటే వార్తల కోసమే ఒక ఛానెల్ అంటే మొదట్లో ఎవరు నమ్మేవారు కాదు అంత చెప్పడానికి ఏముంటుంది అని ... కాని ఛానెల్స్ పెట్టిన వారు బ్రతకాలి అంటే 24 గంటలు సమాచారం ఉండాలి అంటే జరిగిన ప్రతి విషయం వార్త ఛానెల్స్ లో రావాలి ... నెమ్మదిగా ప్రైవేట్ వార్త ఛానెల్స్ సంఖ్య పెరిగింది ... ఇప్పుడు వీటి మధ్య పోటీ ఏర్పడింది ...
నా ఛానెల్ చూడాలంటె వార్తని కొత్తగా చూపించాలని కొందరు ఎవరు చూపించలేని ఘోర వార్తల్ని చూపించాలని కొందరు ఇలా పోటీలో వార్తల్ని సృష్టించడం మొదలయ్యింది ... ప్రతిదీ వార్త అయ్యింది .... చావు , పెళ్లి , విడాకులు , కొట్లాటలు , సమావేశాలు , ప్రమాదాలు అవి ఇవి అన్ని వార్తలే
అలవాటు పడ్డ ప్రజలు ఖాళీ సమయం దొరికితే వార్త ఛానెల్స్ చూసే స్థాయికి అలవాటు పడ్డారు ... ఒకరు నాయకుడు కింద పడ్డాడు అని చూపిస్తే ఇంకొకరు ఎవరు నెట్టారా అని చూపిస్తే ఇంకొకరు అతనే కావాలని పడ్డాడు అని చూపిస్తే ఇలా ఎవరి ధోరణిలో వాళ్ళు వార్తలు సమాచారం అందించడం కంటే బ్రేకింగ్ న్యూస్ అందించడం సాధారణమైపోయింది
కొన్ని వార్త ఛానెల్ ఎవరు డబ్బులు ఇస్తే వారి వార్తలే రావడం వారి గురించే గొప్పగా చెప్పడం మొదలయ్యింది
ఆ తర్వాత అక్కడ నుంచి కాలంలో ప్రయాణం చేస్తూ నేటి రోజులకి వస్తే
ఈ మొత్తం వ్యవస్థని మార్చింది " అంతర్జాలం "
అప్పటి వరకు ఏ వార్తా పత్రికో , ఏ వార్తా సంస్థో చూపించేవే సమాచారం , వార్తలు అయ్యేవి ... వాళ్ళు చూపకూడదు అనుకునేవి బయటకి వచ్చేవి కావు ... ఎవరికీ తెలిసేవి కాదు ...
అంతర్జాలం అనేది నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం ... నా పక్కింట్లో ఒక సైకో ఉంటె అది వార్తల్లో వచ్చే అవకాశం చాలా తక్కువ ఇప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసి అంతర్జాలంలో ఏ యూట్యూబ్ లోనో , ట్విట్టర్ లోనే పెడితే ఖచ్చితంగా తెల్సిపోతుంది ... సదరు అధికారులకి నేరుగా తెలియజేసే అవకాశం కూడా ఇప్పుడు అందరి చేతుల్లోకి వచ్చేసింది
అంతర్జాలం రావడానికి ముందు ... ఏదో ఒక సంస్థ వార్తా పత్రిక అయినా , ఛానెల్ అయినా ఏది వార్త అని , ఏది బయటకి తెలియాలి అని , ఏ వార్తని ఎక్కువ సేపు చూపించాలి అని నిర్ణయించేవాళ్ళు
ఇప్పుడు అలా కాదు ... ప్రజలే నిర్ణయిస్తున్నారు ... ఒక పాప రహదారి ప్రమాదం కాకుండా కాపాడింది అనుకుందాం ఎవరో దాన్ని వీడియో తీసి పెట్టారు ... అది నిజమనిపించి ప్రజలు షేర్ చెయ్యడం మొదలెడితే అదే వైరల్ అవుతుంది అదే అందరికి తెలుస్తుంది ... ఆ పాపని మెచ్చుకుంటారు ... ఇలా ఎవరో ఒక ముక్కుమొహం తెలియని వారి మంచి పని బయటకి తెలిసే అవకాశం ఇంతక ముందు అరుదు ....
ఒకప్పుడు కొందరి దృష్టి కోణం నుంచే అందరూ సమాచారాన్ని చూసే వారు ప్రపంచాన్ని అలానే అర్ధం చేసుకునేవారు .. ఇప్పుడు వివిధ రకాల దృష్టి కోణాలు తెలుస్తున్నాయి , ఒక సంఘటనని పలు రకాలుగా చూడగలిగే అవకాశం ఉంది, నిజమైన బహుళ దృష్టికోణాలు బయటకి వస్తున్నాయి ... దీనివల్ల మంచి ఉంది చెడు ఉంది .. కాని ఇంతక ముందుకు దాకా ఇవి అసలు బయటకి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఉంది ....
కాని ఈ అంతర్జాలం వల్ల వచ్చిన మార్పులేంటి అంటే ... ఇప్పడు 24 గంటలు కాదు ప్రతి సెకను ఏదో ఒక వార్త ... పైగా ప్రపంచం మొత్తం నుంచి ఏమి జరిగిన ఎవరికైనా తెలిసిపోతుంది ... అనుక్షణం ఏదో ఒక సంఘటన ఏదో ఒక సమాచారం ...
ఒకప్పుడు బయట దేశాల వారు చూపే వార్తలు , రాసే వ్యాసాలు ఎవరో మేధావులు మాత్రమే రాస్తారని అవన్నీ నిజాలని అందువల్ల వారు మన దేశం గురించి చెప్పేవి అన్ని నిజాలే అని నమ్మి మోసపొయ్యేవారు ... కాని అంతర్జాలం వల్ల కొన్ని కొన్ని సంస్థలు కావాలనే మన దేశం గురించి విష ప్రచారం చేస్తారని, తక్కువగా అవమానకరం చూపిస్తారని ఇంచుమించు మన దేశస్థులు అందరికి అర్ధమయ్యింది
ఇంతక ముందు కేవలం సంస్థలు మాత్రమే వార్తలు సృష్టించేవి ... ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు సృష్టిస్తున్నారు ... పైగా ఇప్పుడు పెరుగుతున్న AI వాడకం వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో అన్నది తెలుసుకోవడం చాలా కష్టం అవుతోంది ....
ఇప్పుడు చరవాణి ఉన్న ప్రతి ఒక్కరు ఒక దండారో చెప్పగలుగుతున్నారు
జరిగింది చెప్పడం
జరగబోయేది చెప్పడం నుంచి
ఏమి జరిగుండచ్చో చెప్పడం
ఎలా జరిగుండచ్చో చెప్పడం
అసలు ఏమి జరిగినా చెప్పడం
ఇలా ప్రతిదీ చెప్పదగ్గ విషయమే అయ్యింది ...
అప్పట్లో సాంబడు ఉదయాన్నే వేసే దండోరా ఇప్పుడు మనం అందరం వేసే అవకాశం అంతర్జాలం కలిపించింది
నేటి దండారో ప్రతి ఒక్కరు వెయ్యగలరు, వేస్తున్నారు కూడా
రాబోవు రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి
ధన్యవాదాలు 🙏


Yes what you are written is correct. Now a days news is happened or it is created is able to know.
Thank You 🙏